Harish Rao Tweet: ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా మారిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల దగా పడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 2015 నుంచి 2022 వరకు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టును ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కేసీఆర్ పాలనలో రైతుల కోసం తీసుకున్న చర్యలు ఇవే అంటూ వివరించారు. వినూత్న రైతు బంధు పథకం, రెండు దశల వ్యవసాయ రుణ మాఫీ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణం, యూరియా, నాణ్యమైన విత్తనాల లభ్యతను నిర్ధారించడం, యాంత్రీకరణతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించినట్లు తెలిపారు. ప్రతి 5వేల ఎకరాలకు వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,500 రైతు వేదికలు నిర్మించామన్నారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగేలా చేశామని వివరించారు. ఇక వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించామన్నారు.
Also Read: Ponnam Prabhakar: మీరా మాకు నీతులు చెప్పేది..
ఆసరా పెన్షన్, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా కుమార్తెల వివాహాలకు ఆర్థిక సాయం, సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ స్కాలర్‌షిప్‌లు ఇచ్చి పేదలను ఆదుకున్నామని చెప్పారు. పాఠశాల భారాన్ని తగ్గించడానికి 1000కి పైగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఎస్సీ/ ఎస్టీ రైతులకు లబ్ధి చేకూర్చే మహిళల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు స్థాపించామని వెల్లడించారు.అంతేకాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రాధాన్యత ఇచ్చామని హరీశ్ రావు రాసుకొచ్చారు. ఇలాంటి ప్రయత్నాలతో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించామన్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని.. కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తమ 18 నెలల పాలనలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నేతలకు ఎవరికైనా దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఈ సవాల్‌పై ఇప్పటికే కేటీఆర్ స్పందించగా.. తాజాగా హరీశ్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల కోసం ఏం చేశామో తాజాగా లెక్కలతో సహా వివరించారు.