మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని స్పష్టం అయ్యిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారన్నారు.
తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపెట్టాయని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నారు. వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అన్నారు. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారన్నారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయిందన్నారు. విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు హరీష్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు.