ఏడాది పాలనలో వైఫల్యం చెందడంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్(KTR) వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతలు న్యాయనిపుణులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ దోషిగా తేలి శిక్ష పడినట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసులో తప్పు జరిగిందని చెప్పి కోర్టు ఏమీ చెప్పలేదని.. విచారణ చేయవచ్చని మాత్రమే చెప్పిందన్నారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని.. విచారణకు సహకరిస్తామని చెప్పారు. ఈ నెల 9న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతారని వెల్లడించారు.
ఫార్ములా రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప కేటీఆర్‌కు ఏమీ లబ్ధి చేకూరలేదన్నారు. గ్రీన్‌కో కంపెనీ రాష్ట్రంలో ఎలాంటి కాంట్రాక్టులు పొందలేదని.. ఆ సంస్థకు గత ప్రభుత్వంలో ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. అరెస్టులు తమకు కొత్త కాదన్నారు. ఈ కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారని తెలిపారు.