పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారు.. ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రభుత్వంపై మండిపడ్డారు. మాట తప్పడం – మడమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
“Dec 9, 2023కు రుణమాఫీ, ఆగస్టు 15, 2024 వరకు రుణమాఫీ, దసరా వరకు రుణమాఫీ.. అంటూ నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ అందలేదు. రైతుబంధుపై ఇప్పుడు తీసుకుంటే రూ.10వేలు, డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకుంటే రైతు భరోసా రూ.15వేలు. వానాకాలం రైతు భరోసా ఎగరవేశారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు. మాట మార్చి 26 జనవరికి అన్నారు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారు. గత సీఎం కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి సీఎం రేవంత్ రైతులకు భరోసా లేకుండా చేశారు. ఆసరా 4 వేలు, తులం బంగారం, మహిళలకి రూ.2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలి” అంటూ సెటైర్లు వేశారు.