BRS fight against auto drivers problems: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ పోరుబాట పట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ ఊసే ఎత్తలేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికితోడు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిందని ఆరోపించారు. దీంతో ఆటో నడవక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న డ్రైవర్ల జీవితాలు రోజురోజుకి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆటోలో ప్రయాణించారు. కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సమయంలో హరీశ్ రావు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రూ.1500 కోట్లు బాకీ పడింది: దిల్లీకి మూటలు పంపుతున్న రేవంత్ సర్కార్.. ఆటోడ్రైవర్ల ను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటాల మీద ఉన్న శ్రద్ధ ఆటోడ్రైవర్లపై లేదని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పుణ్యమా అని.. అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇకనైనా ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయాలని తెలిపారు. ఆటో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1500 కోట్లు బాకీ పడిందని అన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. వెంటనే ఆటో డ్రైవర్ల కుటుంబాలకు నెలకు రూ.15 వేల ప్రత్యేక భత్యం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/bjp-new-style-campaigning-in-jubilee-hills-by-election/


