Harish Rao Sensational Comments on CM Revanth: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధం కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ పాలనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఆ నియోజకవర్గానికే సంబంధించినది కాదని.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని.. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై హరీష్ రావు ఫైరయ్యారు. రేవంత్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలోని పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం పొంతన లేదని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అని ఆరోపించిన ఆయన.. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశారంటే సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రూ.19,500 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లించగా, రేవంత్ రెడ్డి రెండేళ్లలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని, ఈ కారణంగా కళాశాలలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని వైఎస్సార్ తెచ్చిన పథకమని గొప్పలు చెప్పుకోవడం మినహా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. రూ. 1900 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదని, ప్రశ్నిస్తే అధికారులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 5 వేల కోట్ల అభివృద్ధి జూబ్లీహిల్స్‌లో చేపట్టారని గుర్తుచేస్తూ.. బీఆర్‌ఎస్ కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, పేదల ఇళ్లను రేవంత్ ప్రభుత్వం కూల్చివేసిందని విమర్శించారు.
హైదరాబాద్ ఇన్ సెక్యూరిటీ హబ్‌గా మారింది..
బీఆర్‌ఎస్ హయాంలో అప్పులు రూ.2.80 లక్షల కోట్లు కాగా.. కాంగ్రెస్ రెండేళ్లలో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టామని గుర్తు చేశారు. నిర్వహణ లేక శాంతిభద్రతలు అడుగంటిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 189 హత్యల్లో 88 నడిరోడ్డుపై జరిగాయని, రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచారని, కేసీఆర్ అగ్రికల్చర్ పెంచారని విమర్శించారు. మహిళలపై నేరాలు 12.3%, అత్యాచారాలు 28%, కిడ్నాప్‌లు 26% పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు సరిగా లేక హైదరాబాద్ ‘ఇన్వెస్ట్‌మెంట్ హబ్’ కాస్త ‘ఇన్‌సెక్యూరిటీ హబ్’గా మారిందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు ప్రజలను బెదిరిస్తున్నారని.. పథకాలు ఆగిపోతాయని ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ‘మీరు ఓటర్లు కాదు న్యాయనిర్ణేతలు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే.. కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు, మాగంటి సునితకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని, అది అక్షర సత్యమని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో సైలెంట్ వేవ్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.


