Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీగా చర్చ జరిగింది. ఈ నివేదికను మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నివేదిక కేవలం రాజకీయ కుట్ర అని, కోర్టులో నిలబడదని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. “660 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటే ఎలా? ఇది సాధ్యమయ్యే పనేనా?” అని ప్రశ్నించారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆదివారం రోజు హడావుడిగా సభలో నివేదిక పెట్టడమే దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడిస్తోందని, ఇది కేవలం పొలిటికల్ డ్రామా అని ఆరోపించారు. ఈ కమిషన్ విచారణ నిష్పాక్షికంగా జరిగిందా లేదా తేలాలని డిమాండ్ చేశారు.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి 8(బి) కింద నోటీసులు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే ఆ నివేదికలు చెల్లవని సుప్రీం కోర్టు గతంలో చెప్పిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. గతంలో ఎమర్జెన్సీపై విచారణకు వేసిన షా కమిషన్ నివేదికను కూడా సుప్రీంకోర్టు ఇదే కారణంతో కొట్టివేసిందని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. కాబట్టి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా కోర్టులో నిలబడదని, అది కేవలం డొల్ల రిపోర్ట్ అని ఆయన అన్నారు. తమ హక్కులకు భంగం కలిగినప్పుడే కోర్టుకు వెళ్లామని, అసెంబ్లీలో చర్చించవద్దని కోరలేదని ఆయన వివరించారు. ఈ అంశంపై రేపు, ఎల్లుండి కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని హరీశ్‌రావు ప్రకటించారు.


