Harish Rao Criticizes Modi Revanth : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ‘బడే భాయ్, చోటా భాయ్’ అని సంచలనాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో ఒకే తీరు చూపుతున్నారని, బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పాలిట శత్రువులని తీవ్రంగా విమర్శించారు. జహీరాబాద్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఈ మాటలు రావడంతో రాజకీయ వర్గాల్లో హల్చలు ఎక్కువయ్యాయి.
కేంద్ర మోదీ ప్రభుత్వంపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. “2025-26 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినా కృతజ్ఞత చూపలేదు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మాటలు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.350 నుంచి రూ.1200కు, పెట్రోల్ రూ.65 నుంచి రూ.100కు పెంచారని, ఎన్నికల సమయంలో ధరలు తగ్గించి డ్రామా ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్ధంపైనా హరీశ్ రావు నిప్పులు చెరిగారు. “నమ్మి ఓటేసిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి నట్టేట ముంచుతున్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ లేని విధంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో యూరియా సరఫరా విఫలమైంది” అని దుయ్యబట్టారు. జులై 2025 నుంచి తీవ్రమైన యూరియా కొరతతో రైతుల పంటలు ప్రమాదంలో పడ్డాయి. కమారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా కోరుకుని అరెస్టులు చేశారని, కేంద్రం-రాష్ట్రం రైతులను విస్మరించాయని ఆరోపించారు.
ఇటీవల హరీశ్ రావు రేవంత్ ప్రభుత్వాన్ని ఆరోగ్య శాఖలో కూడా విమర్శించారు. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులు, కంటి వెలుగు, కేసీఆర్ కిట్స్, పోషకాహార కిట్స్‌లను ఆపేశారని, రేవంత్ రాజకీయాల కోసం ప్రజల వైద్యాన్ని పడావు పెట్టారని ఆరోపించారు. వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులు రెండేళ్లు ఆలస్యమవుతున్నాయని, ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే పెద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో హరీశ్ రావు వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఫ్యాన్స్ #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్‌తో మద్దతు తెలుపుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా పరిషత్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో అన్ని స్థానాలు బీఆర్స్ కైవసం చేసుకుంటుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే రక్షణ అని స్పష్టం చేశారు. ఈ విమర్శలతో బీఆర్ఎస్ పార్టీ బలపడుతోందని, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


