ఎల్బి నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హస్తినపురం డివిజన్ పరిధిలోని నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి నగర్, భూపేష్ గుప్తా నగర్, ఆదర్శనగర్ నగర్, వాంబే కాలనీ, నందనవనం, ఇంద్రసేనారెడ్డి నగర్, దేవి నగర్ నందు ఇంటి ఇంటికి తిరుగుతూ పాదయాత్ర చేశారు. సుధీర్ రెడ్డి ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా డప్పు చప్పుళ్లు, ఆటలు, పూలవర్షంతో ఆదరిస్తూ, మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది, శాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొన్నిచోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీవాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ మేనిఫెస్టో చూసి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అన్నారు. మరోసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకొనివెళ్తా అని తెలిపారు. ఎల్బీనగర్ చౌరస్తాని సిగ్నల్ ఫ్రీ చౌరస్తాగా మార్చామన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ఉదయ్ రెడ్డి, శివారెడ్డి, అనిత, డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, వివిధ విభాగాల కమిటీ సభ్యులు, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.