BC reservations in High Court: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి మధ్యాహ్నం 12:30 విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఆరు పిటిషన్లను ఒకేసారి వింటామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠతో కూడిన టెన్షన్ వాతావరణం నెలకొంది.
టెన్షన్ వాతావరణం: రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు సీజే ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు పేర్కొన్నారు. అలాగే.. రిజర్వేషన్లపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ నెలకొంది.
పెద్ద సంఖ్యలో ఇంప్లీడ్ పిటిషన్లు: ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాలు చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్‌లు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ సోమ, మంగళవారాల్లో ఇంప్లీడ్ పిటిషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. మంగళవారం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.


