India’s first greenfield private university : భారత ఉన్నత విద్యా రంగంలో ఓ నూతన అధ్యాయం మొదలైంది. ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానంతో మేళవించి, సరికొత్త తరహా విద్యావిధానానికి హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ శ్రీకారం చుట్టింది. భారత ప్రభుత్వం ఆమోదించిన దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ప్రైవేట్ (డీమ్డ్) విశ్వవిద్యాలయం “హార్ట్‌ఫుల్‌నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (HARI)”ను అధికారికంగా ప్రారంభించింది. అసలు ఏమిటీ విశ్వవిద్యాలయం ప్రత్యేకత…? ఇది విద్యార్థుల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దనుంది..?
విద్యలో నవ ఉషోదయం : హార్ట్‌ఫుల్‌నెస్ మార్గదర్శి, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు పూజ్య దాజీ (శ్రీ కమలేష్ డి. పటేల్) దార్శనికతకు ప్రతిరూపమే ఈ ‘హరి’ విశ్వవిద్యాలయం. ఇది జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా, విద్యార్థులలో మేధో సామర్థ్యంతో పాటు నైతిక స్పష్టత, ఆధ్యాత్మిక సమతుల్యత, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది.
ఈ ఏడాది నుంచే ప్రవేశాలు : ‘హరి’ తన విద్యా ప్రయాణాన్ని ఈ 2025 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తోంది.
తొలి అడుగు: స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా B.Sc. (అగ్రికల్చర్), B.Sc. (హార్టికల్చర్) కోర్సులతో తన కార్యకలాపాలను మొదలుపెడుతోంది.
భవిష్యత్ విస్తరణ: రాబోయే విద్యా సంవత్సరాల్లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ విభాగాలను ప్రారంభించి, B.Tech, B.Arch, MBA, B.Ed, M.A (ఫిలాసఫీ) వంటి కోర్సులను ప్రవేశపెట్టనుంది.
“నిజమైన విద్య కేవలం బోధించకూడదు; అది మార్పు తెచ్చే శక్తిగా ఉండాలి. హరి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చే పట్టభద్రులు విద్యలో ప్రతిభావంతులుగా, నైతికంగా పటిష్ఠులుగా, ఆధ్యాత్మికంగా జాగృతులుగా ఉంటారు.”
– పూజ్య దాజీ, అధ్యక్షులు, శ్రీ రామచంద్ర మిషన్
కృతజ్ఞతలు.. భవిష్యత్ ప్రణాళిక : ఈ చారిత్రాత్మక ఘట్టం సాకారం కావడానికి మద్దతుగా నిలిచిన భారత, తెలంగాణ ప్రభుత్వాలకు దాజీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, నిపుణుల మార్గదర్శకత్వంతో ఈ విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. కన్హా శాంతి వనం సమగ్ర విద్యా వారసత్వంపై నిర్మించబడిన ‘హరి’ విశ్వవిద్యాలయం, పరిశోధన, ఆవిష్కరణలకు మార్గదర్శక దీపంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రస్తుతం B.Sc. (అగ్రికల్చర్), B.Sc. (హార్టికల్చర్) కోర్సులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఔత్సాహిక విద్యార్థులను సంస్థ ఆహ్వానించింది.


