Hyderabad weather: ఆదివారం సాయంత్రం భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి వేడితో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్‌పై అకస్మాత్తుగా వర్షం పంజా విసిరింది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ వంటి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ వంటి ప్రాంతాల్లోనూ జల్లులతో కూడిన వాన పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ భారీ వర్షం నగర జీవితాన్ని ఒక్కసారిగా స్తంభింపజేసింది.
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
ఈ ఆకస్మిక వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా ఇక్కట్లు పడ్డారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నెలకొరిగి రోడ్లపై పడిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమైంది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో మునిగిపోయాయి. ముఖ్యంగా పాతబస్తీ, సికింద్రాబాద్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. నీటిని తొలగించడానికి, పడిపోయిన చెట్లను తొలగించడానికి చర్యలు చేపట్టారు.
మరికొన్ని రోజులు భారీ వర్షాలు
వాతావరణ శాఖ అధికారులు రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.


