హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. ఇంటికి వెళ్లే దారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. సంధ్య థియేరట్ తొక్కిసలాట కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలని అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ నుంచి చిక్కడపల్లి వెళ్లే దారిలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
పోలీసులు నోటీసుల అనంతరం తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు అల్లు అర్జున్. రాత్రి వివిధ దఫాలుగా వారితో చర్చలు జరిపారు. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలనే దానిపై కసరత్తు చేశారు. విచారణకు హాజరవ్వాలా..? సమయం కోరాలా..? అనే విషయంపై చర్చలు చేశారట. అయితే విచారణకు హాజరుకావడమే మంచిదని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో కాసేపట్లో బన్నీ పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. కాగా బన్నీని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ విచారించనున్నారు.