Heavy Rain Alert to Telangana, AP districts: బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని, దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు (శుక్ర, శని) వారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు (శనివారం) నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక రాబోయే 2 గంటల్లో యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఏపీలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజుల పా టు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 5 జిల్లాలకు ఆరెంజ్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు కర్నూలు, నంద్యాల జిల్లాలకు సైతం భారీ వర్ష సూచన చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


