Flash Floods: ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. నాలాల్లో ఇద్దరు గల్లంతు కాగా.. వట్టినాగులపల్లిలో గోడ కూలి శేఖర్ అనే వ్యక్తి మరణించారు.
వట్టినాగులపల్లిలో విషాదం: గచ్చిబౌలిలోని వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ.. వర్షం ధాటికి కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని ఆదిలాబాద్‌కు చెందిన 24 ఏళ్ల కూలీ శేఖర్ మండల్ మరణించారు. మరో నలుగురు కూలీలు – కుల్దాన్, రవిపాశ్వాన్, నర్సింహ, మహేశ్వర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
గల్లంతైన యువకులు: నాంపల్లిలోని అఫ్జల్‌సాగర్ నాలాలో పడి 24 ఏళ్ల అర్జున్, 25 ఏళ్ల రామ్ గల్లంతయ్యారు. అదేవిధంగా, ముషీరాబాద్‌లోని వినోభా కాలనీలో నాలా గోడ కూలడంతో సన్నీ అనే యువకుడు వరదలో కొట్టుకుపోయారు.
నగరంలో కొట్టుకుపోయిన పలు వాహనాలు: ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ, బాపూజీనగర్ సమీపంలో వరదనీటికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. కవాడిగూడ, జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 75 వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఆకస్మిక వర్షం వల్ల నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/honey-trap-on-yoga-teacher-two-women-looted-rs-56-lakhs/
మేయర్ పరిశీలన: బంజారాహిల్స్‌లోని జలమయమైన రహదారులను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు. వరద నీటిని త్వరగా తొలగించి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తగు సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వర్షపాతం వివరాలు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టిఅన్నారంలో అత్యధికంగా 12.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్‌లో 12.1 సెం.మీ., ఓయూలో 10.1 సెం.మీ., మెట్టుగూడ, మారేడుపల్లిలో 9.5 సెం.మీ., షేక్‌పేట్‌లో 9.4 సెం.మీ., కాప్రాలో 9.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ప్రభావం: దేశంలో ఉత్తర భాగం నుంచి నైరుతి రుతుపవనాలు మళ్లీ వెనక్కి మళ్లాయని.. వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సోమ, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రమంతటా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


