Cyclone Montha: ‘మొంథా’ ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో ఈ తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11.30 నుంచి 12.30 గంటల మధ్య ‘మొంథా’ తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొంథా తీరం దాటినప్పటికీ.. భూభాగంపై సైతం తీవ్ర తపానుగానే కొనసాగుతోందని తెలిపారు.తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మొంథా తుపాను ఉత్తర వాయువ్య దిశలో తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్నట్టుగా తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.’మొంథా’ తుపాను ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ వైపు దూసుకొస్తున్న మొంథా: ‘మొంథా’ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే వాతావరణం మేఘావృతమై ఉండగా.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేటలో అత్యధికంగా 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలలకు సెలవు: మొంథా తుపాన్ నేపథ్యంలో మహబూబ్‌నగర్ డీఈవో ప్రవీణ్ కుమార్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాద్ జిల్లాలో సైతం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో నేడు జరగనున్న త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం ఆ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు.

పలు జిల్లాలకు కీలక హెచ్చరికలు జారీ: మొంథా తుపాను తీవ్రతను అంచనా వేసిన వాతావరణ శాఖ.. పలు జిల్లాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున మూడు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాల్లో బుధవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా మరో 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ,సూర్యాపేట, మహబూబాబాద్,వరంగల్,హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల,నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోఅధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని హెచ్చరించింది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ అధికారులకు సూచించింది.


