Weather Forecast: తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 21 ఆదివారం రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు తప్పవని వెల్లడించింది. నేడు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌తో పాటుగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీవర్ష సూచన ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కుంభవృష్టిని తలపిస్తాయని హెచ్చరించింది.
సాధారణం కంటే అధిక వర్షపాతం: ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉదయం పూట ఎండలు అధికంగా ఉన్నప్పటికీ.. సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో సాధారణం కంటే 109% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 10 రోజులు కూడా ఇదే తరహా వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. ఇది ఆకస్మిక వరదలకు దారి తీయవచ్చని హెచ్చరించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read:https://teluguprabha.net/telangana-news/heavy-rains-forecast-for-telugu-states/
ఏపీలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అప్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సైతం హెచ్చరించింది. ఈ నెల సెప్టెంబర్ 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. 28న అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


