Heavy Rains in Hyderabad: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వరణుడు వదలడం లేదు. పగబట్టినట్లే ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తోంది. నిన్న (ఆదివారం) భారీ వర్షం కురవగా.. మళ్లీ ఇవాళ (సోమవారం) సాయంత్రం నగరాన్ని వర్షం పలుకరించింది. సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షంగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వాతావరణం 3.30 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది. క్యూమిలో నింబస్ మేఘాల ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. దీంతో మరో రెండు మూడు గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. వర్షాలకు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ మాన్సూన్, హైడ్రా డీఆర్‌ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది.
Also Raed: https://teluguprabha.net/telangana-news/telangana-cm-for-speeding-up-land-acquisition/
ఈ ఏరియాల్లో హై అలర్ట్..
కుండపోత వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంజాగుట్ట- ఖైరతాబాద్ రూట్‌లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లక్డీకాపూల్- అసెంబ్లీ ఏరియాలో తీవ్రమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ వంటి ఉన్నత వర్గాల ప్రాంతాల్లో కూడా వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీనగర్‌కాలనీలో రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మరో రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.


