Thursday, July 10, 2025
HomeతెలంగాణRains: తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

Rains: తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

Heavy Rains In Telangana: జూన్ నెలలో వరుణుడు మొహం చాటేయడంతో దిగులుపడ్డ రైతులు వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు బలంగా విస్తరించడంతో జులై నెలలో సమృద్ధిగా వర్షాలు పడతాయని తెలిపారు. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి వేగంగా కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

- Advertisement -

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే మరికొన్ని జిల్లాలలో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, కుమరం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపారు.

ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాలు నేపథ్యంలో పొలం పనులకు వెళ్లే ప్రజలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వానలు పడే సమయంలో గుడిసెలు, చెట్లు కిందకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ అధికారుల హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఏపీలోనూ వానలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. అందుచేత తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని సూచనలు చేశారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News