Heavy rainfall warning for Telangana : తెలంగాణను వరుణుడు వీడనంటున్నాడు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంపై మళ్లీ వాన కారు కమ్మింది. రాబోయే 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంతకీ ఈ అల్పపీడనం మరింత బలపడనుందా..? ఏయే జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది..? ప్రభుత్వం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది..?
అల్పపీడన ప్రభావం.. అతి భారీ వర్ష సూచన: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రాబోయే 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనించనుంది. దీనికి రుతుపవన ద్రోణి కూడా తోడవడంతో, తెలంగాణపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
10 సెం.మీ.కి పైగా వర్షపాతం: ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు, 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ: ముందుజాగ్రత్త చర్యగా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అవి: భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, ములుగు, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్.
ఎల్లో అలర్ట్: మరో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
జిల్లాల్లో జల దిగ్బంధం: ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమవుతోంది.
మహబూబాబాద్‌లో స్తంభించిన జనజీవనం: ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, గూడూరు మండలాల్లో వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల సమీపంలోని పాకాల ఏరు పొంగడంతో 15 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయ్యారం పెద్దచెరువు మత్తడి పోస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ములుగులో అదే పరిస్థితి: ఏటూరునాగారం మండలంలో అత్యధికంగా 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జంపన్నవాగు ఉగ్రరూపం దాల్చడంతో కొండాయి, మల్యాల వంటి అనేక గిరిజన గ్రామాలకు రవాణా స్తంభించింది.
హైదరాబాద్‌లోనూ వాన: సోమవారం నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి, అల్వాల్, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి సహా అనేక ప్రాంతాల్లో వాన పడటంతో, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.


