Jurala Project: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 01 లక్ష 12 వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 01 లక్ష 12 వేల 525 క్యూసెక్కులుగా ఉందతి.అయితే ప్రస్తుతం ప్రాజెక్టుకు 1.40లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 12 గేట్లను ఎత్త దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 317.190 మీటర్లగా ఉంది.
అలాగే మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 7.535 టీఎంసీలుగా ఉంది. ఇక స్పిల్‌వే ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులు బయటకు వెళ్తుంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25,691 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,30,780 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం 179.89 టీఎంసీలకు చేరింది.
Also Read: జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల ఇన్ ఫ్లో వివరాలు
వరద నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 24 గంటల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో నేడో, రేపో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు.. రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తంగా 67,399 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.