తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్న హెచ్‌సీయూ భూముల(HCU Lands) వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు(TG Highcourt) కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి(గురువారం) వరకు చెట్ల నరికివేత పనులు ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. 400 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచంద్ వాదించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే కొన్నాళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివాదాస్పద భూముల్లో మూడు చెరువులు, రాక్ స్ట్రక్చర్, జంతువులు ఉన్నాయన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు చెట్ల నరికివేతను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.