Hit and Run case | బీఆర్ఎస్ నేత, బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 16న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని సూచించింది.
గతేడాది హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో రాహిల్ పై పంజాగుట్ట పోలీస్ సెషన్ లో కేసు నమోదైంది. ప్రమాదంలో కారు డ్రైవర్ ని మార్చి రాహిల్ పరారైనట్లు పోలీసులు ఆరోపించారు. హిట్ అండ్ రన్ కేసు (Hit and Run case)లో రాహిల్ అసలైన నిందితుడని నిర్ధారించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో అతను విదేశాలకు పారిపోయాడు.
ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న రాహిల్.. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హై కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. పోలీసు విచారణకు హాజరవ్వాల్సిందే అని రాహిల్ ని ఆదేశించింది. పరారీలో ఉన్న రాహిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతాడా లేదా అనేది వేచి చూడాలి.