BC Reservations High Court Stay: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జారీ చేసిన జీవో 9పై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. నాలుగు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది.
తెలంగాణలో ఓ వైపు ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైన వేళ.. తాజాగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించడంతో.. ఎన్నికల ప్రక్రియ సైతం నిలిచిపోనుంది.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తొలిసారిగా తెలంగాణలోనే జరిగిందని ఏజీ సుదర్శన్ రెడ్డి అన్నారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లు చేసిన విధానాన్ని ఏజీ కోర్టుకు వివరించారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6 శాతంగా తేలిందని తెలిపారు. ఈ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.
బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని.. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని ఏజీ వివరించారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే.. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదన్నారు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందని.. గవర్నర్ గడువులోపు ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
బీసీ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా అని హైకోర్టు ఏజీని ప్రశ్నించగా.. ఆమోదించిందని ఏజీ సమాధానమిచ్చారు. వాదనల అనంతరం రిజర్వేషన్లపైన జారీ చేసిన జీవో నెంబర్ 9 తో పాటుగా ఈ జీవో ఆధారంగా జారీ చేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పైన హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.


