వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్‌పోర్టు(Mamunur Airport)ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్(BJP vs Congress) కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టు క్రెడిట్ తమకే దక్కుతుందంటూ నినాదాలు చేశారు.
బీజేపీ నేతలు ప్రధాని మోదీకి పాలాభిషేకం చేయగా.. కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.