హెచ్ఎంపివి (Hmpv) వైరస్ ఉత్తదే.. అది మనను ఏం చేయదు.. ఎప్పటి నుంచో వుండంటున్న వైద్యులు.. ఇదిలా ఉంటే Hmpv దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మన పోరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుతో పాటు గుజరాత్‌లోనూ కేసులు వెలుగు చూడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రజలు కరోనా నాటి రోజులను గుర్తుతెచ్చుకుంటున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌లు ఉంటాయా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చిరుద్యోగులు, ఆ మాటకొస్తే కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మీడియా ఉద్యోగులు కూడా తమ పరిస్థితి ఏంటని భయ పడుతున్నారు. చైనాలో పుట్టింది అని తెలియగానే మొదటే కంగారు పడ్డారు. అంతలోనే అది భారతదేశంలోనూ ప్రవేశించిందనగానే ఏమవుతుందో అన్న ఆలోచన మొదలైంది.
నిజానికి హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదు. ఎప్పుడో 2001లోనే దీన్ని నెదర్లాండ్స్‌లో గుర్తించారు. మన దేశంలోనూ ఇది అప్పటినుంచే ఉంది. ఈమధ్య కూడా పలు కేసులను హైదరాబాద్‌లోని వైద్యులు గుర్తించారు. అసలు తెలంగాణలో ఇప్పటివరకు హెచ్ఎంపీవీ కేసులన్నవే లేవని ప్రభుత్వం ప్రకటన చేయడంపై పలువురు వైద్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంపీవీ వ్యాధి లక్షణాలకు సాధారణ దగ్గు, జలుబు,శ్వాస సంబంధిచిన మందులనే వాడుతారు. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. ఇదో భయంకరమైన వైరస్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు ఖండిస్తున్నారు. చాలా మంది విషయంలో ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (ఎగువ శ్వాసనాళం)లో వస్తుందని, కొద్దిమందిలో మాత్రం దిగువ శ్వాసనాళంలోనూ వస్తుందని.. అప్పుడే కొంత జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వినియోగించడం, చేతుల పరిశుభ్రత పాటించడం, వ్యాధి సోకినవారికి దూరంగా ఉండడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇది వచ్చే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు సోకొచ్చని అంటున్నారు. కరోనా తరహాలోనే హెచ్ఎంపీవీ కూడా ‘ఆర్ఎన్ఏ’ రకం వైరస్. అందువల్ల దీనిలోనూ కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర లక్షణాలు ఉంటాయి. వైరస్ ప్రధానంగా నోటి తుంపరల ద్వారా వ్యాపిస్తుందని… ఆ తుంపరలు పడిన చోట తాకడం, లేదా ఆ గాలి పీల్చడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చెబుతున్నారు.
కనుక్కున్నది ఎవరు: హ్యూమన్ మెటా న్యూమో వైరస్‌ను తొలిసారిగా 2001లో నెదర్లాండ్స్ మహిళ శాస్త్రవేత్త బెర్నాడెట్ జి.వాన్ డెన్ హూగెన్, ఆమె సహచరులు గుర్తించారు. కానీ, దీని సెరలాజికల్ ఆధారాలను బట్టి చూస్తే.. 1958 నుంచే ఇది వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు తెలిపారు. శీతాకాలంలో దాదాపు ప్రతి సంవత్సరం ఈ వైరస్ కనిపిస్తూనే ఉంటుందని, అయితే.. ఇప్పుడు చైనాలో ఎక్కువగా రావడం, గతంలో కరోనా కూడా అక్కడినుంచే మొదలు కావడంతో అందరూ అనవసరంగా ఆందోళన చెందుతున్నారని వైద్యులు తెలిపారు. సాధారణంగా ఒకటి, రెండు రోజుల్లో ఫ్లూ లక్షణాలు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దగ్గు, ముక్కు దిబ్బడ, తరచు తుమ్ములు, కళ్లు ఎర్రబడడం, మింగడం కష్టం కావడం, గొంతు బొంగురుపోవడం లాంటివి దీని ప్రధాన లక్షణాలు. రక్తపరీక్షలో తెల్లరక్తకణాల సంఖ్య బాగా తగ్గడం, ఇస్నోఫీలియా పెరగడం లాంటివి ఉన్నా దీని గురించి అనుమానించాలి. దీని చికిత్సకు యాంటీవైరల్ మందులు ఏమీ లేవు. లక్షణాలను బట్టే చికిత్స చేయాలి.
చైనాలో రావడంతో భయాందోళనలు: కొవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పుడు చైనాలో హెచ్‌ఎంపీవీ కూడా విస్తరిస్తోంది. దీంతో మళ్లీ కరోనా తరహా ఇబ్బందులు వస్తాయన్న భయం ప్రజల్లో ఉంది. చైనాతో పాటు జపాన్‌లోనూ భారీగా కేసులు నమోదు కావడంతో ఈ భయం మరింత ఎక్కువైంది. దీంతో పాటు ప్రభుత్వాలు సరైన సమాచారం తెలుసుకోకుండా ప్రకటనలు జారీచేయడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో కూడా హెచ్ఎంపీవీని గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి మొదలుపెట్టి… చివరకు టిండర్ లాంటి డేటింగ్ యాప్‌లలో కూడా దీని గురించి తెగ చర్చలు నడుస్తున్నాయి. నిన్నమొన్నటివరకు మహమ్మారిలా వ్యాపించి, అన్నివర్గాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన కొవిడ్ తరహాలో ఇది కూడా ఇబ్బంది పెడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
దేశంలో ఇప్పటికి ఏడు కేసులు: భారతదేశంలో ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఏడు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 3 , 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ నిర్ధారణ అయ్యింది. రాజస్థాన్‌కు చెందిన మరో చిన్నారి అహ్మదాబాద్‌లో ఈ వ్యాధితో చికిత్స పొందుతోంది. తమిళనాడులో రెండు కేసులు వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 8, 13 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలకు హెచ్ఎంపీవీ సోకింది. దీన్ని బట్టి చూస్తే ఐదేళ్లలోపు పిల్లలకే వస్తుందని చెప్పడం కూడా సరికాదని అంటున్నారు. అయితే, భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని, అందువల్ల దీనిపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. .హెచ్‌ఎంపీవీ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, న్యుమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది.
కేంద్రం గమనిస్తోంది- జేపీ నడ్డా: హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, ఇది 2001లోనే తొలిసారి బయటకొచ్చిందని వైద్యనిపుణులు తెలిపినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. “హెచ్ఎంపీవీ అనేది గాలిలో వ్యాపిస్తుంది, అన్ని వయసుల వారికీ రావచ్చు. ప్రధానంగా శీతాకాలంలోను, వసంతరుతువు తొలినాళ్లలోను ఇది వస్తుంది” అని ఆయన ఒక వీడియో ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందక్కర్లేదని, కేంద్ర ప్రభుత్వం దీని క్షుణ్ణంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.
ఆందోళన చెందక్కర్లేదు- సౌమ్యా స్వామినాథన్: హెచ్ఎంపీవీ అనేది అసలు ఆందోళన చెందాల్సిన అంశం కానే కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. “ఇది అందరికీ తెలిసిన వైరస్సే. దీనివల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ప్రజలందరూ సాధారణ జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మాస్కులు ధరించండి, చేతులు తరచు శుభ్రం చేసుకోండి, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లొద్దు, లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లండి” అని ఆమె సూచించారు.
అన్ని వయసుల వారికీ వస్తాయి: హెచ్ఎంపీవీ వల్ల ఎగువ, దిగువ శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది అన్ని వయసుల వారికీ వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీ మార్పిడి, కాలేయమార్పిడి లాంటివి చేయించుకున్నవారిలో ఇమ్యూనో సప్రెసెంట్లు వాడతారు. అలాంటివారు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఎంపీవీ అనేది వ్యక్తుల నుంచి వ్యక్తులకు, ఉపరితలం నుంచి వ్యక్తులకు వ్యాపిస్తుంది. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, ఊపిరి ఆడకపోవడం దీని లక్షణాలు. కొందరికి బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి కూడా రావచ్చు” అని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.
రహస్యమేం కాదు.. ప్రతి సంవత్సరం వస్తాయి: మీడియా అంతా గత రెండు రోజులుగా చైనాలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ పైనే దృష్టిపెట్టింది. ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణలో ఒక్క కేసూ నమోదు కాలేదని చెప్పడం తప్పు. ఇది రహస్యమైన వైరస్ ఏమీ కాదు. ప్రతి సంవత్సరం ఈ వైరస్ సోకిన వారిని చూస్తాము. జూలై/ఆగస్టు నుంచి డిసెంబర్/జనవరి మధ్యలో ఈ వైరస్ కేసులు నమోదు అవుతుంటాయి. చాలా సందర్భాలలో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రమైన అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్టు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితమైన యాంటీవైరల్ మందులేమీ లేవు. లక్షణాలను బట్టే చికిత్స చేస్తారు. భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా చైనాలో హెచ్‌ఎంపీవీ అనేది సీజనల్‌గానే వస్తోందా, లేదా దాని కొత్త ఉత్పరివర్తనాల వల్ల వినాశనం కలిగిస్తోందా అనే సమాచారం ఇంకా లేదు. పిల్లలు అనారోగ్యంతో ఉంటే పాఠశాలకు పంపకండి. దానివల్ల వేరే కొంతమంది పిల్లలకు తీవ్రమైన అనారోగ్యంగా మారవచ్చు. కాబట్టి వ్యాదులతో సంబంధం లేకుండా మాస్కులు ధరించి, పరిశుభ్రత పధ్దతులను పాటించండి. చేతులు శుభ్రంగా పెట్టుకోండి.”
- డాక్టర్ శివరంజని సంతోష్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్స్, మాగ్నా సెంటర్స్