Holidays For Educational Institutions Due to Heavy Rains: మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తుండగా, ఏపీని మాత్రం వర్షాలతో ముంచెత్తుతోంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొంథా తుఫాను కారణంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొoథా తూఫాను దృష్ట్యా యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా రేపు (గురువారం) సెలవు ప్రకటించినట్లు ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే, పరిస్థితులను బట్టి మరిన్ని సెలవును పొడిగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే, తెలంగాణలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గురువారం భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
కాకినాడ తీరం దాటిన తుఫాను..
తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాను ప్రభావం ఉన్నట్లు తెలిపింది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు, భారీవర్షాలతో మొంథా ముంచేసింది. సింగరేణి వ్యాప్తంగా నిలిచింది బొగ్గు ఉత్పత్తి. మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు గనుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని పత్తి, వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య గంటకు 90-110 కి.మీ వేగంతో మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి తీరం దాటింది. మోంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక, హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపా దడపా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నగరవాసులు అత్యవసరం అయితే తప్ప బయటకు రావాలని, ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు.


