Saturday, November 15, 2025
HomeతెలంగాణChild adoption : మాతృత్వపు మధురిమ.. మీ ఇంట చిన్నారి నవ్వులు పూయాలా? దత్తత ప్రక్రియ...

Child adoption : మాతృత్వపు మధురిమ.. మీ ఇంట చిన్నారి నవ్వులు పూయాలా? దత్తత ప్రక్రియ ఇదే!

Child adoption process Telangana : సంతానం లేని దంపతులకు అమ్మ అని, నాన్న అని పిలిపించుకోవాలనేది ఓ తీరని కల. ఆ కలను సాకారం చేసే వరం దత్తత. అమ్మానాన్నల ప్రేమకు నోచుకోని అనాథ బిడ్డలకు ఆదరణ లభించే ఆశ్రయం దత్తత. ఇది కేవలం ఒక ప్రక్రియ కాదు, రెండు జీవితాలను కలిపే ఒక పవిత్రమైన బంధం. అయితే, చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అసలు పిల్లలను దత్తత తీసుకోవడానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఈ ప్రక్రియలో ఉన్న మెళకువలేంటి? 

- Advertisement -

దత్తతకు ఎవరు అర్హులు : పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండి, పిల్లలను పెంచగల సామర్థ్యం ఉన్నవారు. దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే, ఇద్దరి అంగీకారం తప్పనిసరి.
నిబంధనల ప్రకారం, నిర్దేశిత ప్రమాణాలను నెరవేర్చినట్లయితే ఒంటరి మహిళలు లేదా విడాకులు పొందిన వారు కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చు. ఒంటరి పురుషుడు కేవలం బాలుడిని మాత్రమే దత్తత తీసుకోగలడు, బాలికను దత్తత తీసుకునేందుకు అనర్హుడు.

అమ్మాయే కావాలి.. మారుతున్న సమాజం : ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావించే సమాజంలో నేడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు దూసుకుపోతుండటంతో, శిశుగృహల నుంచి పిల్లలను దత్తత తీసుకునేవారిలో అధికశాతం మంది ఆడపిల్లలనే ఎంచుకోవడం విశేషం. ఇది సామాజికంగా వచ్చిన ఓ సానుకూల పరిణామం.

దరఖాస్తు విధానం.. అంతా ఆన్‌లైన్‌లోనే : దత్తత ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరం మరియు పారదర్శకంగా మారింది. మీరు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: దీనికోసం కేంద్ర దత్తత వనరుల సంస్థ అయిన http://www.cara.nic.in  అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ప్రక్రియ: వెబ్‌సైట్‌లో అవసరమైన వివరాలను నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుదారుల అర్హతలను అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఊయల’ – అనాథలకు ఆసరా : వివిధ కారణాల వల్ల పిల్లలను పెంచలేని వారు, వారిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, ప్రభుత్వమే ఆసుపత్రులు, కార్యాలయాల వద్ద “ఊయల”లను ఏర్పాటు చేసింది. ఈ ఊయలలో వదిలి వెళ్లిన పిల్లలను మహిళా, శిశు సంక్షేమ శాఖ సంరక్షించి, శిశుగృహలకు తరలిస్తుంది.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. అక్రమ దత్తత నేరం : పిల్లలను కేవలం చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలి. అక్రమంగా దత్తత తీసుకోవడం లేదా పిల్లలను విక్రయించడం తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.

“చట్టబద్ధంగా మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలి. అర్హులకే పిల్లలను ఇచ్చేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆసక్తి ఉన్నవారికి సహాయం చేసేందుకు హెల్ప్‌లైన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం.”
– లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారిణి, సంగారెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad