How to file a police complaint : “పోలీసులు, కేసులు మనకెందుకులే..” – అన్యాయం జరిగినప్పుడు, మనలో చాలామందికి వినిపించే మాట ఇది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే ఓ తెలియని భయం, గంభీరంగా కనిపించే ఖాకీ దుస్తులపై ఓ అపోహ. కానీ, ఆ ఖాకీల వెనుక మనకు రక్షణగా నిలిచే ఓ వ్యవస్థ ఉందని, మన హక్కులను కాపాడేందుకు వారున్నారని మనం గుర్తుంచుకోవాలి. నేటి ఆధునిక పోలీస్ వ్యవస్థ, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’తో ప్రజలకు చేరువవుతోంది. అసలు పోలీస్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలి? ఫిర్యాదు ఎలా చేయాలి? ఎఫ్‌ఐఆర్ అంటే ఏమిటి? స్టేషన్ బెయిల్ ఎవరికిస్తారు?
అపోహలు వద్దు.. అండగా ఉంటారు : పోలీస్ స్టేషన్ అంటే కేవలం నేరగాళ్లను ఉంచే ప్రదేశం కాదు, బాధితులకు న్యాయం జరిగేందుకు తొలి అడుగు పడే చోటు. శాంతిభద్రతలకు భంగం కలిగినా, ఎవరి వల్లనైనా మీకు ఇబ్బంది ఎదురైనా, నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చు. “పోలీసులు, కేసులు నీకు అవసరమా?” అని భయపెట్టే వారి మాటలు విని, మీకు జరిగిన అన్యాయాన్ని మిన్నకుండిపోవద్దు.
ఫిర్యాదు చేయడం ఎలా? దశలవారీ ప్రక్రియ : పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే ప్రక్రియ చాలా సులభం, పారదర్శకమైనది.
రిసెప్షన్‌ను సంప్రదించండి: ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఓ రిసెప్షన్ కేంద్రం ఉంటుంది. మీరు ముందుగా అక్కడికి వెళ్లి, మీ సమస్యను క్లుప్తంగా వివరించాలి.
రాతపూర్వక ఫిర్యాదు: మీ సమస్య వారి పరిధిలోనిదైతే, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వమని సూచిస్తారు. ఆ ఫిర్యాదును, ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారికి (ఎస్సై/సీఐ) పంపుతారు.
ప్రాథమిక విచారణ: అధికారి మీ ఫిర్యాదు ఆధారంగా, ప్రాథమిక విచారణ కోసం సిబ్బందిని ఘటనా స్థలానికి పంపవచ్చు లేదా సంబంధిత వ్యక్తులను విచారించవచ్చు.
ఎఫ్ఐఆర్ అంటే భయపడొద్దు!
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR).. ఈ మాట వినగానే చాలామంది భయపడతారు. కానీ, దీని గురించి స్పష్టత అవసరం.
ఎఫ్ఐఆర్ అంటే?: మీ ఫిర్యాదులో నిజం ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత, పోలీసులు నమోదు చేసే మొదటి అధికారిక పత్రమే ఎఫ్‌ఐఆర్.
దోషిగా నిర్ధారణ కాదు: ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన, నిందితుడు నేరం చేసినట్లు రుజువైనట్లు కాదు. అది కేవలం పూర్తిస్థాయి దర్యాప్తునకు నాంది మాత్రమే. ఎఫ్‌ఐఆర్ తర్వాత, పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి, కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. తుది నిర్ణయం న్యాయస్థానం తీసుకుంటుంది.
‘స్టేషన్ బెయిల్’ అంటే : ప్రతి కేసులోనూ వెంటనే అరెస్టులు ఉండవు. ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ జైలు శిక్ష పడే చిన్న కేసులలో, నిందితుడికి పోలీస్ స్టేషన్‌లోనే నోటీసు ఇచ్చి, పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీనినే ‘స్టేషన్ బెయిల్’ అంటారు. అయితే, నిందితుడి నేర చరిత్ర, కేసు తీవ్రత ఆధారంగా, కోర్టు అనుమతితో అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది. ఏడేళ్లకు పైగా శిక్ష పడే తీవ్రమైన నేరాలలో నిందితులను తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాల్సిందే.
ప్రజల్లో భయాన్ని పోగొట్టి, బాధితులకు భరోసా కల్పించేందుకే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి, మీకు అన్యాయం జరిగినప్పుడు, ఏమాత్రం భయపడకుండా, ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జరిగింది చెప్పండి.

