Sunday, October 6, 2024
HomeతెలంగాణHuzurabad: ఆ అధికారి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే?

Huzurabad: ఆ అధికారి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే?

అమెరికాలో ఉన్న మహిళ పేరుపై ఉన్న భూమిని కాజేసిన..

డబ్బు మనిషిని ఏ స్థాయికి అయినా దిగజారుస్తుంది అంటారు కానీ ఇక్కడ అధికారి తలుచుకుంటే ఒకరి పేరుపై ఉన్న భూమిని వారికి తెలియకుండానే మరో వ్యక్తికి పట్టా మార్పిడి చేయవచ్చు అని నిరూపిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటీవల కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గతంలో తాహసిల్దారుగా పనిచేసిన సమయంలో చిల్ల శ్రీనివాస్ అనే తహసిల్దార్ ఎప్పుడో మృతి చెందిన వారి పేరుపై ఉన్న భూమిని మృతుని కుటుంబ సభ్యులు తెలియకుండానే మరో వ్యక్తి పేరుపై పట్టా మార్పిడి చేసి ప్రస్తుతం కటకటాల పాలైన విషయం మరవకముందే కరీంనగర్ జిల్లా వీణవంక తాహసిల్దార్ కార్యాలయంలో చోటు చేసుకున్న మరో ఉదాంతం రెవెన్యూ శాఖలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతుంది.

- Advertisement -

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ మహిళ కు సంబంధించిన భూమిని ఆమెకు తెలియకుండానే మరో వ్యక్తి పేరుపై పట్టా మార్పిడి చేసేందుకు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నడుము బిగించారంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ధరణిలో ఉన్న చిన్న చిన్న వెసులుబాట్లను సద్వినియోగం చేసుకుని, కోట్ల విలువ చేసే భూములపై కన్నేసిన భూ కబ్జాదారులు రెవిన్యూ సిబ్బందిని, అధికారులను ప్రలోభాలకు గురిచేస్తూ ఇలాంటి అక్రమ పట్టా మార్పిడికి పాల్పడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే….
వీణవంకకు చెందిన శివప్రియ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటుంది. శివప్రియకు సంబంధించిన భూమిని వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. అయితే ఆమె అందుబాటులో లేనందున ధరణీ ద్వారా అక్రమంగా సేల్ డీడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుట్రకు నడుం బిగించారు. ఇందుకోసం శివప్రియ ఇక్కడ ఉన్నప్పుడు వినియోగించిన మొబైల్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుందని గమనించి ఆ నెంబర్ కోసం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ నెంబర్ ను ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వినియోగిస్తున్న విషయం తెలుసుకుని ధరణీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఆ మొబైల్ నంబర్ వినియోగిస్తున్న వ్యక్తి ఆచూకి తెలుసుకొని అతని వద్దకు కొంతమంది వెళ్లగా, ధరణీ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేందుకు వీణవకంలో మరికొంతమంది ఉన్నారు. ధరణీలో డాక్యూమెంట్లులో డాక్యూమెంట్లు అప్ లోడ్ చేయగానే శివప్రియ గతంలో వాడిన మొబైల్ నంబర్ వినియోగిస్తున్న అతనికి ఓటీపీ రాగానే ఆ నెంబర్ ను వీణవంకకు షేర్ చేశారు. దీంతో ఆన్ లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సదరు భూమికి బహిరంగ మార్కెట్ లో కోట్లలో ధర పలుకుతుండడంతో అమెరికాలో ఉన్న శివప్రియకు సంబంధం లేకుండానే భూ పట్టా మార్పిడి జరిగినట్టు స్పష్టం అవుతుంది.
✳️ అక్రమ రిజిస్ట్రేషన్ పై తాహసిల్దార్ వింత ఫిర్యాదు…
ధరణీ ఆపరేటర్ పై నమ్మకం ఉంచి తాను రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చానని తహసీల్దార్ తిరుమల్ రావు మార్చి 6న వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 2023 అసెంబ్లీ ఎన్నికల డ్యూటీలో ఉన్నానని ఆర్డోఓ కార్యాలయంలో ఉన్న తనకు ఆపరేటర్ అరుణ్ చౌదరి ఫోన్ చేయడంతో అప్రవూల్ ఇచ్చానంటున్నారు. ప్రత్యక్ష్యంగా తహసీల్దార్ కార్యాలయంలో లేనప్పుడు వ్యవసాయ భూమి
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అప్రూవల్ చేసేంత అవసరం ఏమి వచ్చిందో ఆ అధికారికే తెలియాలి…? ఎలక్షన్ కమిషన్ వేసిన విధుల్లో ఉన్నప్పుడు తిరుమలరావుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ధరణీ ఆపరేటర్ ఫోన్ చేయగానే ఎలా అప్రూవల్ ఇస్తారన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పట్టదారు, కొనుగోలు దారుతో పాటు సాక్షులను ప్రత్యక్ష్యంగా చూడకుండా, రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించకుండా అసలు తహసిల్దార్ కార్యాలయంలో లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఎంప్లాయ్ మాటలను విశ్వసించానని తహసీల్దార్ చెప్తున్న తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది. వీణవంక
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తహసీల్దార్ పేర్కొన్న వివరాలను చూస్తుంటే తహసీల్దార్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారన్న విషయం స్పస్టంగా అర్థమవుతోందని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. గత ఏడాది నవంబర్ లో అప్రూవల్ చేస్తే ఇప్పుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రధానంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన స్లాట్ బుక్ చేసినప్పుడే రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఇవ్వాల్సిన నిబందన కూడా లేదని తెలుస్తోంది. తహసీల్దార్లు ఇతర పనుల్లో బిజీగా ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాంటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ విషయంలో ఎందుకు ఉదారంగా వ్యవహరించారన్నదే చూస్తుంటే భారీ మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
✳️ తాహసిల్దార్ ను సస్పెన్షన్ చేసిన జిల్లా కలెక్టర్…
భూమి అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తహసీల్దార్ తిరుమల్ రావుకు సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతనిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
✳️ భూ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక పలువురి హస్తం ఉన్నట్లు ప్రచారం…
వీణవంకకు చెందిన శివప్రియకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పలువురి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారం వెనక మండలానికి చెందిన కొంతమంది ములాఖత్ అయి డాక్యూమెంట్లను క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కానిచ్చేసినట్టుగా తెలుస్తోంది. ధరణీలో ఈజీగా అప్రూవల్ చేయించుకోవచ్చన్న ధీమాతోనే సిండికేట్ గా మారిన కొంతమంది ఈ వ్యవహారాన్ని చాకచక్యంగా చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కథ అడ్డం తిరగడంతో అక్రమ భూ బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. తాహసిల్దార్ తిరుమల్ రావు ఇప్పటివరకు చేసిన భూ రిజిస్ట్రేషన్ లపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని ఆసక్తిని రేకెత్తించే విషయాలు వెలుగు చూపే అవకాశం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News