హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ధ్వంసమైన రోడ్లను, వరద నీరు చేరిన ఇండ్లను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నివాస గృహాలలోకి వరద నీరు చేరిన బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చి అధైర్య పడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక వర్షపాతం కురిసిందని దీంతో పలు గ్రామాల రహదారులు పూర్తిగా ధ్వంసం అయినట్లు చెప్పారు. భారీగా కురిసిన వర్షంతో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో సదరు నివాస గృహాల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నివాస గృహాల్లోకి నీరు చేరి ఆర్థికంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించాలని, ధ్వంసమైన రోడ్లకు త్వరితగతిన మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, నేరెళ్ల మహేందర్ గౌడ్, కంకణాల సురేందర్ రెడ్డి, జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, పల్లెపు రవి, తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.