జమ్మికుంట మండలం వావిలాల మానేరులో చిక్కుకున్న 85 మంది అంతరాష్ట్ర కార్మికులను వరద ఉధృతి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కాపాడారు. జమ్మికుంట మండలం వావిలాల మానేరు వాగు సమీపంలో ఎలక్ట్రికల్ టవర్స్ నిర్మాణం పనులను చేపడుతున్నారు. అట్టి పనులను చేసేందుకు అంతరాష్ట్ర కార్మికులు 85 మంది బీహార్, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చి మానేరు సమీపంలో తాత్కాలిక నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మానేరులో వరద నీటి ప్రవాహం పెరిగింది. దీనికి తోడు వావిలాల, నాగారం, నగరం గ్రామాల నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కార్మికులు వరద నీటి మధ్యలో చిక్కుకున్నారు. అటుగా వెళుతున్న స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మర్రి మల్లేశం వరద నీటిలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిని గమనించి వెంటనే రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎంపిటిసి సభ్యుడు అందించిన సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డిఓ హరి సింగ్, తాసిల్దార్ బండి రాజేశ్వరి, హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి, జమ్మికుంట సిఐ రమేష్ స్థానికుల సాయంతో అంతరాష్ట్ర కార్మికులను క్షేమంగా వావిలాల గ్రామానికి తరలించారు. దీంతో వలస కార్మికులతో పాటు అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్డిఓ హరి సింగ్, ఏసిపి జీవన్ రెడ్డి మాట్లాడుతూ… గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు పూర్తిస్థాయిలో నిండుకున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మానేరు పరివాహ ప్రాంతాల ప్రజల సైతం అనునిత్యం అప్రమత్తతతో ఉండాలని వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మానేరు పరివాహక ప్రాంతం వైపు ఎవరు కూడా వెళ్ళవద్దన్నారు. మత్స్యకారులు సైతం చేపలు పట్టేందుకు అటువైపు వెళ్ళకూడదన్నారు. అంతరాష్ట్ర కార్మికులను కాపాడడంలో తన వంతు పాత్ర పోషించిన స్థానిక ఎంపిటిసి సభ్యుడు మర్రి మల్లేశం ను ఈ సందర్భంగా అధికారులు అభినందించారు.