హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కొందరు మినరల్ వాటర్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో బోరు నీటినే మినరల్ వాటర్‌గా పేర్కొంటూ దండుకుంటున్నారు. దీంతో శుద్ధి నీరే కదా అని తాగేస్తున్న జనం రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ముంచు’నీళ్ల వ్యాపారంపై ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులు దృష్టిసారించడం లేదు. నాణ్యత, ఐఎస్‌ఐ గుర్తింపు లేని మినరల్ వాటర్ ప్లాంట్లను గుర్తిస్తారో లేక కాసులకు కక్కుర్తి పడి ఉదాసీనంగా వ్యవహరిస్తారో వేచిచూడాలి.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్ లు…
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో రోజురోజుకూ మినరల్ వాటర్ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐఎస్‌ఐ నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందకుండానే నీటి వ్యాపారాలకు తెర తీస్తున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతోపాటు కమలాపూర్, వీణవంక ఇల్లందకుంట మండలాలలో కనీస నిబంధనలు పాటించకుండా పలు ప్లాంట్లలో మినరల్ వాటర్ పేరుతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో చిన్నచిన్న హోటళ్ల వద్ద నుంచి పెద్ద రెస్టారెంట్‌ల వరకు, మధ్యతరగతి, దిగువ వర్గాలు సైతం మినరల్ వాటర్ క్యానులు కొనుగోలు చేయడంతో వ్యాపారం ఊపందుకుంది. ఫలితంగా నిబంధనలు పక్కన పెట్టిన యజమానులు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించని ప్లాంట్లపై అధికారులు దాడులు చేయకపోడం విస్మయాన్ని కలిగిస్తుంది. అధికారులు అలసత్వం వీడి పూర్తిస్థాయిలో నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు
నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్‌లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాటర్ ప్లాంట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఫుడ్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ శాఖలు వాటర్ ప్లాంట్‌లపై నియంత్రణ కలిగి ఉంటాయి. అయితే మామూళ్ల మత్తులో ఆ శాఖల అధికారులు ప్లాంట్లవైపు కొన్నేళ్లుగా కన్నెత్తి చూడకపోవడంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏళ్లుగా అవే క్యాన్లు వాడుతుండటంతో ఫంగస్ పేరుకుపోతోంది. కనీస శుభ్రత పాటించకుండా రోజూ అదే క్యాన్లలో నీటిని నింపి విక్రయించడంతో ఉదర సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి. సాధారణ ఇళ్లకు సరఫరా చేసే క్యాన్ ఒక్కో దానికి రూ.15 వసులు చేస్తున్నారు. అయితే ఎక్కడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.
ఈ నీరు తాగితే అనారోగ్యం కొన్నట్టే
శుద్ధిజలం పేరుతో ప్రతిరోజు లీటర్ల కొద్దీ తాగుతున్న నీటితో ప్రజలకు తెలియ కుండానే అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. కనీస నాణ్యత ప్రమాణాలు లేకుండా నేరుగా బోరు నీళ్లనే మినరల్స్ తీసేసి క్యాన్ల లో నింపి ఫ్రిజ్‌లలో కూలింగ్ పెట్టి అమ్ముతుండటంతో వాటి నాణ్యతను ప్రజలు గుర్తించలేకపోతున్నారు. దీంతో కాలక్రమేణా ఉదర సంబందమైన (కడుపు నొప్పి) సమస్యలు అధికంగా ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి కలుషిత నీరు తాగడంతో మలేరియా, టైఫాయిడ్, కడుపులో మంట వంటి సమస్యలు, కీళ్లనొప్పులు, ఎముకలు, లివర్‌పైనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.