నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారని, రైతుల పేరుతో రాజకీయాలు వద్దని బీఆర్ఎస్ సర్కారు కోమటిరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చింది. అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నట్టు.. అకాలవర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించినట్టు వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తారంటూ నిరంజన్ రెడ్డి అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గాని మరొకరు గాని తీసుకురావడం తమ బాధ్యత అయినప్పటికీ.. రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్ నాం చేయాలనే అలోచన సబబు కాదన్నారు.
అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై ఇలా ఘాటుగా స్పందించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.