గోశామహల్ నియోజకవర్గంపై ఎగిరేది గులాబీ జెండాయెనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాంకోటిలోని రూబీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన గన్ ఫౌండ్రీ డివిజన్ BRS పార్టీ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమావేశాల ఇంచార్జి దాసోజు శ్రవణ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి BRS కార్యకర్త ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల్లో BRS పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. గోశామహల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించింది, అభివృద్ధి పనులు చేసింది ముఖ్యమంత్రి KCR నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు.
నియోజకవర్గ పరిధిలో పాదయాత్రలు చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని తమ దృష్టికి తీసుకొస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా వాటి పరిష్కరిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. తాము అన్ని విధాలుగా నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి నందు బిలాల్, సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్, నాయకులు సంతోష్ గుప్తా, శ్రీనివాస్ యాదవ్, ధన్ రాజ్, శాంతాబాయి, సరస్వతి, అనిత తదితరులు పాల్గొన్నారు.