నిన్న వరంగల్ లో బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చ్ జరిగిందని, ఆ మార్చ్ అబద్దాల మార్చ్ అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని, బీజేపీకి తెలంగాణలో నిరుద్యోగుల మార్చ్ చేసే అర్హత లేదన్నారు వారు. అదేదో చేస్తే ఢిల్లీ లో చేయాలని, మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు వాటి గురించి బీజేపీ మోడీ ని నిలదీయాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్ చేయడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. నిన్నటి ఆ మార్చ్ లో నిరుద్యోగులు లేరు అడ్డ మీద కూలీలే ఉన్నారన్నారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ లో బీజేపీ చిచ్చు పెట్టాలనుకుంటోందని, మతం కులం ఆధారంగా బీజేపీ ప్రజలను విడగొడుతోందని వారు భగ్గుమన్నారు. ఆ కుట్రలను బీ ఆర్ ఎస్ తిప్పి కొడుతుందని, కుటుంబ పాలన తెలంగాణలో అమలు కావడం లేదని, కేసీఆర్ కుటుంబం కాదు తెలంగాణ కుటుంబ పాలన తెలంగాణలో అమలవుతోందన్నారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయని, మాట్లాడితే కేసీఆర్ కుటుంబం గురించి తప్ప బీజేపీ దగ్గర సబ్జెక్టు లేదన్నారు.