పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్లోని మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా “దత్తత హెల్ప్ డెస్క్” ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ ను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంతానం కలగని దంపతుల కోరికను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రక్రియల ద్వారా పిల్లల దత్తత ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కు సంబంధిత పత్రాలు కేరింగ్ వెబ్ సైటు లో అప్లోడు చేయబడతాయని పేర్కొన్నారు. దత్తత గురించి సరైన అవగాహన లేని వారు పిల్లలు లేని తల్లి దండ్రులు ఒత్తిడికి నిరాశకు గురి అవుతున్నారని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ దత్తత సేవా కేంద్రంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పిల్లలను దత్తత తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల వరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగంవారు నాలుగు సార్లు విజిట్ చేసి పిల్లల పరిస్థితి ఎలా ఉందని పర్యవేక్షిస్తారని తెలిపారు. వారికి ఏవైనా సమస్యలు ఉన్న వాటి పరిష్కారానికి హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని వెల్లడించారు.
తెలంగాణలో దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు 040-23748663 / 040-23748664 నెంబర్లలో సంప్రదించవచ్చని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలీ కేరి, జెడి లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.