సంగారెడ్డిలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. నిత్యం కేసీఆర్ పై నిప్పులు చెరిగే జగ్గారెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్ తో భేటీ కావటం ప్రత్యేకత సంతరించుకుంది. గతంలోనూ వీరిద్దరు ఇలా భేటీ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు కేసీఆర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం సంగారెడ్డి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగ్గారెడ్డి ఓటమిపాలయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి కేసీఆర్ గద్దెనెక్కగా జగ్గారెడ్డి సంగారెడ్డి కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా వీళ్లిద్దరూ భేటీ కావటంతో అందరూ వీరి భేటీపై తెగ చర్చలు చేసుకుంటున్నారు. జగ్గారెడ్డి మాత్రం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం భేటీ అయినట్టు చెప్పటం విశేషం. మెట్రో రైలును సంగారెడ్డి వరకూ పొడిగించాలని తాను కేసీఆర్ ను కోరినట్లు చెప్పారు జగ్గారెడ్డి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు పీఎం మోడీని కలిస్తే లేని వివాదం, తాను సీఎం కేసీఆర్ ను కలిస్తేనే వస్తుందా అంటూ జగ్గారెడ్డి నిలదీస్తున్నారు.