వరంగల్ జిల్లా వడ్డేపల్లి వాస్తవ్యులు, కాచిగూడ రైల్వే స్టేషన్ డైరెక్టర్, తాళ్లపల్లి ప్రభు చరణ్ పదవీ విరమణ సందర్భంగా మెట్టుగూడలోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. అంబేద్కర్ వాది, ఆదర్శమూర్తి, ప్రతిష్టాత్మకమైన భారత రైల్వేలో 33 సంవత్సరాల సుదీర్ఘకాలం అమూల్య సేవలు అందించి ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న శ్రీ తాళ్లపల్లి ప్రభు చరణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బండ ప్రకాష్. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రతి అడుగూ పదిలంగా వేస్తూ ఉద్యోగ బాధ్యతలకు అంకితమై చిత్తశుద్ధితో శ్రమించి ఎన్నో పదోన్నతులు పొంది అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్న అగ్రసేని అధికారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ గా రిటైర్డ్ కావడం అనేది ఎంతో గౌరవప్రదమైన, స్ఫూర్తిదాయకమైన, ఆదర్శనీయమైనదని అన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత సామాజిక దృక్పథంతో సమాజ సేవలలో నిమగ్నం అవ్వాలని కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
రైల్వేలో అంకిత భావంతో ఉత్తమ సేవలందించి, టెరిటోరియల్ ఆర్మీ సుబేదారుగా దేశానికి సేవలందించి, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు విశిష్ట సేవలు అందించి, అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి, వాలీబాల్, అథ్లెటిక్స్ లో ఆల్ రౌండర్ గా రాణించి, రాష్ట్రపతి అవార్డుతో సహా, ఎన్నెన్నో రైల్వే అవార్డులను సొంతం చేసుకున్న ప్రభు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.