జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణతోపాటు, గ్రామ పంచాయతీలకు బకాయీల నిధులను విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శలను కనికరించారని, జీపీలకు నిధులు విడుదల చేయడం వల్ల అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి ఆస్కారమిచ్చారని ఆ సంఘం తెలిపింది. ఆ సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, మరికొందరు ఆ సంఘం బాధ్యులు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిశారు. సిఎం కెసిఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు సర్పంచ్ లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
అలాగే వీళ్ళంతా కలిసి సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి సర్పంచ్ లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బూడిద రామ్ రెడ్డి, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలను శ్రీనివాస్ రెడ్డి, పొట్ట సత్యం గౌడ్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘంకు చెందిన శశిధర్, శివ, భాస్కర్, హరి, శివకుమార్ తదితరులు ఉన్నారు.