భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) పార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కొందరు సామాజిక కార్యకర్తలు హోం మంత్రి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి వారిని హోంమంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ కు చెందిన జావేద్ అహ్మద్, మహమ్మద్ ఫరూఖ్, పర్వేజ్ అహ్మద్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతి దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పథకాలన్నీ తెలంగాణ ప్రభుత్వంలోనే ఉన్నాయని, అవన్నీ అమలు చేస్తున్నామని, ఈ ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రం రోజురోజుకూ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని అన్నారు. గుజరాత్ మోడల్ అనే మాటకు వాస్తవం లేదనీ, గుజరాత్ ప్రజలు ఉపాధి, విద్యుత్, నీరు ఇతర సమస్యలతో బాధపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని హోం మంత్రి అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ అక్బర్ హుస్సేన్ తదితరులున్నారు.