యువతకు ఆధునిక విద్యతోపాటు మన పవిత్ర గ్రంథాలపై అవగాహన కల్పించాలని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఉదాసీన్ మఠ్ అధ్యక్షుడు మహంత్ రఘు ముని శుక్రవారం కూకట్‌పల్లిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఉదాసీన్ మఠ్ ఆధ్యాత్మిక,విద్యా కేంద్రానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మేల్యే మాట్లాడుతూ ఉదాసీన్ మఠం ఎంతో గొప్ప సేవ చేస్తున్నదని, హైదరాబాద్‌లో వేద పాఠశాల, గోశాల, ఆసుపత్రి, అనాథాశ్రమం వంటి ఇతర సౌకర్యాలతో సహా అనేక ప్రజా ప్రయోజన సౌకర్యాలను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మఠం అందించే సేవలకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహాకారాలను అందిస్తామన్నారు.
నూతనంగా అభివృద్ధి చేస్తున్న ఈ కేంద్రంలో శాంతినివాస్, వేద పాఠశాల, యాగశాల, గోశాలతో సహా అనేక కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఉదాసీన్ మఠ్ అధ్యక్షుడు మహంత్ రఘు ముని మాట్లాడుతూ ఈ ప్రదేశం ఉదాసీన్ మఠ్‌కు ఒక తపో స్థలి వంటిదని, శ్రీ బాబా సజ్జన్ షా కమలాపతిజీ ఇక్కడ తపస్సు చేశారని, ప్రపంచంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ గత మూడు రోజులుగా ఇక్కడ భూమి పూజ మరియు పవిత్ర హవనం చేసామన్నారు. మనం ఎంతో పవిత్రంగా భావించే గోవుల సంరక్షణ కోసం ఇక్కడ ఒక గోశాల ఏర్పాటు అలాగే హైదరాబాద్‌ను సందర్శించే సాధువులు మరియు సత్పురుషుల కోసం సంత్ నివాస్ అదేవిధంగా అన్నదాన సేవతో పాటు ఇక్కడ అనాథలకు ఆశ్రయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉదాసీన్ మఠ్ ఉపాధ్యక్షులు, మహంత్ అరుణ్ దాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.