మహిళలను రక్షించే విషయంలో యువత ఛత్రపతి శివాజీలా ఉండాలని యూత్ ఐకాన్, సీబీఐ మాజీ డైరెక్టర్ జె.డి. లక్ష్మినారాయణ అన్నారు. సామాజికవేత్త ఆలపాటి లక్ష్మినారాయణ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ నేటి యువతకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక స్ఫూర్తి చిహ్నమని అన్నారు.
శత్రువులను వ్యూహాత్మకంగా మట్టుబెట్టడంలోనే కాదు స్త్రీలను గౌరవించడంలో కూడా ఎంతో ఉత్తమ వ్యక్తిత్వం శివాజీ సొంతమని కొనియాడారు లక్ష్మినారాయణ. నేటి యువత అటువంటి సంస్కారాలను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, గంజాయి, గుట్కా, మద్యం వంటి చెడు వ్యసనాలను యువత బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారతీయ యువత సామర్థ్యం చాలా ఎక్కువని అన్నారు. జీవితం సముద్రం వంటిదని దాని ఈదేందుకు ఓర్పు, నేర్పు రెండు ఎంతో అవసరమన్నారు. యువతకు శ్రీరామచంద్రుడు, శివాజీ మహారాజ్ వంటి వారు ఆదర్శం కావాలని కాంక్షించారు.