అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమల(Sabarimala) వెళ్లిన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్(Hyderabad) ఉప్పరిగూడకి చెందిన అయ్యప్పస్వాములు శబరిమలకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు(BUS Accident) కేరళలోని కొట్టాయం కనమల అట్టివల వద్ద బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు స్పాట్‌లోనే మృతి చెందాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడగా.. మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడు రాజు హైదరాబాద్‌లోని సైదాబాద్ ఏకలవ్య నగర్లో నివాసం ఉంటున్నాడు.
కాగా కొట్టాయం నుంచి శబరిమలకు వెళ్తుండగా పంబానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడింది. అయితే పక్కన చెట్లు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. బస్సు ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద కిందకు దిగుతుండగా అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.