Naturopathy hospital in Hyderabad : పట్టణ జీవనంలో పరుగులు, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి.. ఆధునిక జీవనశైలి మనకు అందిస్తున్న అనారోగ్య ‘కానుక’లివి. మందుల వాడకం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నా, శాశ్వత ఆరోగ్యం ఓ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. ఇలాంటి తరుణంలో, నగర నడిబొడ్డున ఉంటూనే ప్రకృతితో మమేకమయ్యే అవకాశం ఉంటే? మందుల ప్రమేయం లేకుండానే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోగలిగితే? హైదరాబాద్ బల్కంపేటలోని కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం ఇదే భరోసాను అందిస్తోంది. అసలు ఏమిటీ ప్రకృతి వైద్యం..? ఈ చికిత్సాలయంలో ఎలాంటి వ్యాధులకు స్వస్థత చేకూరుతుంది..? సామాన్యులకు ఇది అందుబాటులో ఉందా..?
ప్రకృతి వైద్యం అంటే : మన శరీరం పంచభూతాల (నేల, నీరు, గాలి, అగ్ని, ఆకాశం) సమాహారం. ఈ పంచభూతాల సాయంతోనే శరీరంలోని అంతర్గత ప్రాణశక్తిని ఉత్తేజపరిచి, వ్యాధులను మూలాల నుంచి పెకిలించడమే ప్రకృతి వైద్యం. ఇది కేవలం చికిత్సా పద్ధతి కాదు, అదొక జీవన విధానం. మందుల ప్రమేయం లేకుండా సహజ వనరులతో శరీరం తనను తాను బాగుచేసుకునేలా ప్రేరేపించడమే ఈ వైద్యం యొక్క విశిష్టత.
ఏ వ్యాధులకు చికిత్స : ఈ చికిత్సాలయంలో పలు దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధులకు సమర్థవంతమైన వైద్యం అందిస్తున్నారు.
మధుమేహం (షుగర్), థైరాయిడ్
స్థూలకాయం, అధిక బరువు
మెడ, నడుము, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం
చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు
జీర్ణకోశ సంబంధిత సమస్యలు (అజీర్తి, గ్యాస్, మలబద్ధకం)
మానసిక ఒత్తిడి, నిద్రలేమి
ఆసుపత్రి ప్రత్యేకతలు.. సేవల సమాహారం ఇది కేవలం ఆసుపత్రి మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్య కేంద్రం.
ఇక్కడ లభించే సేవలు, ప్రత్యేకతలు..
సంపూర్ణ వసతి: ఇన్-పేషెంట్, ఔట్-పేషెంట్ సౌకర్యంతో పాటు, చికిత్స పొందుతున్న వారికి వ్యక్తిగత, షేరింగ్ కాటేజీల సదుపాయం ఉంది.
ఆరోగ్యకరమైన ఆహారం: అత్యాధునిక భోజనశాలలో పౌష్టికాహారం అందిస్తారు. ఆవరణలోని ‘కిచెన్ గార్డెన్’లో పండించిన తాజా కూరగాయలనే వంటకు ఉపయోగిస్తారు.
శారీరక వ్యాయామం: నిపుణుల పర్యవేక్షణలో యోగా, ప్రాణాయామం, ధ్యానం నేర్పిస్తారు. ఓపెన్ జిమ్, ప్రత్యేకమైన ‘8-పాత్‌వే’ (నడకదారి) ఉన్నాయి.
ప్రత్యేక చికిత్సలు: గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేందుకు, స్త్రీ, పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ప్రత్యేక చికిత్సలు అందిస్తారు.
నిపుణుల బృందం: అనుభవజ్ఞులైన థెరపిస్టులు, హౌస్ సర్జన్లు, యోగా నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటారు.
అందించే చికిత్సా విధానాలు : పూర్తిగా సహజ పద్ధతుల్లో, పంచభూతాల ఆధారంగా ఇక్కడ చికిత్సలు ఉంటాయి.
మట్టి చికిత్స (మడ్ థెరపీ)
జల చికిత్స (హైడ్రోథెరపీ, మర్దన, తానాబాత్)
సూర్యకిరణ, వాయు చికిత్సలు
ఫిజియోథెరపీ, ఆక్యుప్రెజర్, ఆక్యుపంక్చర్
షట్కర్మల చికిత్స, ఆథపత్ స్నానం
తెల్ల రేషన్ కార్డుతో రాయితీ : ఈ అత్యాధునిక సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఓ చక్కటి అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి చికిత్స ఖర్చులో ప్రత్యేక రాయితీ లభిస్తుంది.


