NH-163 Highway Accidents : ప్రయాణం అంటే గమ్యం చేరాలి, కానీ ఈ దారిలో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. సోమవారం చేవెళ్ల వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఒక ఉదాహరణ మాత్రమే. నిజాం కాలం నాటి ఈ రహదారిపై నిత్యం నెత్తురు పారుతూనే ఉంది. కేవలం 69 కిలోమీటర్ల పొడవు, కానీ ఐదేళ్లలో 211 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా విస్తరించకపోవడమే ఈ రక్తచరిత్రకు కారణమా? లేక పనులకు అడ్డుపడుతున్న శక్తులు ఏవి? ఈ మృత్యుమార్గంపై ప్రయాణం ఎప్పటికి సురక్షితంగా మారుతుంది? ఆ వివరాల్లోకి వెళ్తే..
భయపెడుతున్న గణాంకాలు : హైదరాబాద్ – బీజాపూర్ (విజయపుర) జాతీయ రహదారి-163పై ప్రయాణం అంటేనే వాహనదారులు జంకుతున్నారు. గణాంకాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.
దూరం: అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు 69 కిలోమీటర్లు.
గత ఐదేళ్లలో:
ప్రమాదాలు: 720
మరణాలు: 211 మంది
క్షతగాత్రులు: 737 మంది
ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు, చిన్నపాటి గాయాలతో బయటపడిన వారు వేలల్లోనే ఉన్నారు.
ప్రమాదాలకు అడ్డా.. మృత్యువు పొంచిన మలుపులు : ఈ రహదారిపై ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రమాదకరమైన మలుపులు. ఈ 69 కిలోమీటర్ల మార్గంలో ఏకంగా 50 ప్రమాదకర మలుపులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మొయినాబాద్, చేవెళ్ల మండలాల్లోని అజీజ్‌నగర్, చిన్నషాపూర్, కనకమామిడి, ముడిమ్యాల్, మీర్జాగూడ వంటి ప్రాంతాల్లోని మలుపులు మృత్యు కేంద్రాలుగా మారాయి. ఈ మలుపుల కారణంగానే వారానికి సగటున 3 నుంచి 5 ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విస్తరణకు ఏళ్ల తరబడి ఆటంకాలు : నిజాం కాలంలో బీజాపూర్‌కు రాకపోకల కోసం నిర్మించిన ఈ రహదారి, ప్రస్తుతం హైదరాబాద్‌ను కర్ణాటకలోని కలబురగి, బీజాపూర్‌లతో పాటు వికారాబాద్ జిల్లాను కలుపుతూ అత్యంత కీలకమైనదిగా మారింది. పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండలకు, వేలాది మంది ఉద్యోగులు, రైతులు, ప్రజలు నిత్యం ఈ మార్గంపైనే ఆధారపడతారు. పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారిని విస్తరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
2018లో కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ రహదారి-163గా గుర్తించి, రూ.785 కోట్లతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46.40 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు 2022లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. భూసేకరణ కూడా పూర్తయింది. అయితే ఈ మార్గంలో పలువురు ప్రముఖుల ఫాంహౌస్‌లు ఉండటం, 900కు పైగా మర్రిచెట్లను తొలగించాల్సి రావడంతో పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ను ఆశ్రయించడంతో పనులపై స్టే విధించబడింది.
తొలగిన అడ్డంకులు.. చిగురించిన ఆశలు : సంవత్సరాలుగా సాగుతున్న ఈ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. మర్రి చెట్లను తొలగించకుండా, అత్యాధునిక సాంకేతికతతో వేరేచోటికి తరలిస్తామని (రీలొకేట్ చేస్తామని) అధికారులు హామీ ఇవ్వడంతో, రెండు రోజుల క్రితం ఎన్జీటీ స్టేను ఎత్తివేసింది. దీంతో రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికైనా పనులు వేగంగా పూర్తి చేసి, ఈ రహదారి రక్తచరిత్రకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు.


