Fire safety in Hyderabad coaching centers : లక్షల్లో ఫీజులు.. వేలల్లో విద్యార్థులు.. కానీ భద్రత మాత్రం గాలికి! ఉత్తరప్రదేశ్‌లోని కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం, హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రాల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఇరుకు భవనాల్లో, కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా నడుస్తున్న వందలాది కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అసలు నగరంలోని కోచింగ్ సెంటర్లలో క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలున్నాయా?
భద్రత గాలికి.. నిబంధనలు బేఖాతరు : నగరంలో అధికారికంగా 120 కోచింగ్ సెంటర్లు ఉన్నా, అనధికారికంగా వందల సంఖ్యలో వెలిశాయి. గ్రూప్స్, యూపీఎస్సీ అంటూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఈ కేంద్రాలు, భద్రతా నిబంధనలను మాత్రం తుంగలో తొక్కుతున్నాయి.
అత్యవసర ద్వారాలు మాయం: చాలా సెంటర్లలో అత్యవసర ద్వారాలు (Emergency Exits) లేవు. ఒకే ఇరుకైన మెట్ల మార్గంతో నాలుగైదు అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
గాలి, వెలుతురు కరువు: సరైన వెంటిలేషన్ లేకుండా, ఒకే గదిలో వందలాది మంది విద్యార్థులను కుక్కేస్తున్నారు.
అగ్నిమాపక పరికరాల కొరత: అగ్నిమాపక పరికరాలు చాలా చోట్ల కనిపించవు. ఉన్నా, అవి పనిచేసే స్థితిలో లేవు.
మాక్ డ్రిల్స్ శూన్యం: ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ నిర్వహించిన పాపాన పోలేదు.
అశోక్‌నగర్‌లో దారుణ పరిస్థితి : హైదరాబాద్ కోచింగ్ సెంటర్ల రాజధానిగా పిలుచుకునే అశోక్‌నగర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక మంచం పట్టేంత గదుల్లో 20 కుర్చీలు వేసి, ప్రైవేట్ లైబ్రరీలుగా నడుపుతున్నారు. 500 మంది కూర్చునే క్లాస్ రూములలో, ఒకరి వెనుక ఒకరు కూర్చోవడంతో, ప్రమాదం జరిగితే ముందున్న వారు కదిలే వరకు వెనకున్న వారు బయటకు రాలేని పరిస్థితి.
గత ఘటనలు గుణపాఠం కావా ..
ఉత్తర్ ప్రదేశ్ (శనివారం): కోచింగ్ సెంటర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఢిల్లీ (గతేడాది): సెల్లార్‌లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ లైబ్రరీలోకి వరద నీరు చేరి, ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, హైదరాబాద్‌లోని నిర్వాహకుల్లో, అధికారుల్లో చలనం రాకపోవడం విచారకరం.
కొలువుల జాతర.. పొంచి ఉన్న ప్రమాదం : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో, వేలాది మంది నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్ల బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో, విద్యా శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని, నగరంలోని అన్ని కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టి, భద్రతా నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, మరో ఘోరం జరగక ముందే మేల్కొనకపోతే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


