Road Accident:
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల డల్లాస్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని బలిగొంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన వెంకట్, ఆయన భార్య తేజస్విని, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెంకట్ కుటుంబం తమ బంధువులను కలవడానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకుంది. తిరుగు ప్రయాణంలో, వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఒక భారీ ట్రక్ ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారుకు మంటలు అంటుకొని, కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులోని నలుగురు సజీవదహనమయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అవశేషాల నుంచి మృతుల గుర్తించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం శేషంగా మిగిలిన భాగాలను ప్రయోగశాలకు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, వెంకట్ కుటుంబం కొన్ని రోజుల పాటు సెలవుల కోసం అమెరికాలోని బంధువుల వద్దకు వెళ్లినట్టు సమాచారం. ఈ దుర్ఘటనకు సంబంధించిన వార్త కుటుంబ సభ్యులు, స్నేహితుల హృదయాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషాదకర ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రానుండగా, మృతుల మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కౌన్సులేట్ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.


