Hyderabad Ganesh immersion: భాగ్యనగర వీధులు గణేష్ ఉత్సవాల జోరు మిన్నంటాయి. డప్పుల ధ్వని, డోలు వాయిద్యాల శబ్దం, యువకుల నాట్యాలతో కూడిన వేడుకల్లో ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు మార్మోగాయి. ప్రజల సందడితో నగరం ఉల్లాసంగా మారింది. పదకొండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికేందుకు నగరం మొత్తం హుస్సేన్‌సాగర్ వైపు కదిలింది. విద్యుత్ కాంతుల వెలుగుల్లో సాగరం ఓ సరికొత్త శోభను సంతరించుకోగా, రాత్రంతా సాగిన నిమజ్జన కోలాహలం నేటి మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. ఇంతకీ ఆ సాగర తీరాన నిన్న రాత్రి జరిగిన సందడి ఏంటి..? గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే ఆఖరి ఘట్టం ఎలా సాగింది.?
జనసంద్రమైన భాగ్యనగరం : గణనాథుల శోభాయాత్రతో ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, పాతబస్తీ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన కూడళ్లన్నీ జనసంద్రంగా మారాయి. చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. చిందులేస్తూ, పాటలు పాడుతూ పార్వతీసుతుడిని సాగనంపారు. భారీ విగ్రహాల రాకతో హుస్సేన్‌సాగర్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ లంబోదరుడి నిమజ్జనాలు సాయంత్రానికే ప్రశాంతంగా పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
హెలికాప్టర్‌లో పర్యవేక్షణ.. నేలమీద సందడి: నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. మరోవైపు, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది భక్తులతో మమేకమయ్యారు. ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వంటి వారు డప్పుల మోతకు స్టెప్పులేసి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ వంటి ప్రముఖులు శోభాయాత్రకు స్వాగతం పలికారు.
కొన్ని ఆసక్తికర ఘట్టాలు..
ఎద్దుల బండిపై గణపయ్య: పర్యావరణ పరిరక్షణ సందేశాన్నిస్తూ, అంబర్‌పేటకు చెందిన యువకులు తమ గణనాథుడిని సంప్రదాయబద్ధంగా ఎద్దుల బండిపై ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిన్నపాటి వాగ్వాదం: చిన్న విగ్రహాల వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతించకపోవడంతో లిబర్టీ కూడలి వద్ద భక్తులు పోలీసులతో స్వల్ప వాగ్వాదానికి దిగారు.
విదేశీయుల ఆసక్తి: భాగ్యనగర గణేష్ నిమజ్జన వైభవాన్ని చూసేందుకు విదేశీయులు సైతం ఆసక్తి చూపించారు.
జీహెచ్‌ఎంసీ చిన్న విగ్రహాల కోసం ముషీరాబాద్, అంబర్‌పేట వంటి ప్రాంతాల్లో ప్రత్యేక వాటర్ పౌండ్లను ఏర్పాటు చేసింది. వేలాది విగ్రహాలు ఇప్పటికే గంగమ్మ ఒడికి చేరగా, ఈ నిమజ్జన ప్రక్రియ నేటి మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు .


