Indian-origin leaders in US politics : అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేతలు మరోసారి విజయకేతనం ఎగురవేశారు. చరిత్రాత్మక ఎన్నికల్లో సత్తా చాటి, అమెరికా రాజకీయ యవనికపై తమదైన ముద్ర వేశారు. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన గజాలా హష్మీ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మరోవైపు, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ తనయుడు జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికై సంచలనం రేపారు. హైదరాబాద్ గల్లీల నుంచి వర్జీనియా అధికార పీఠం వరకు సాగిన ఆమె ప్రస్థానం ఏమిటి? న్యూయార్క్ నగరానికి మేయర్‌గా ఎన్నికైన ఆ యువకెరటం ఎవరు? ఈ విజయాల వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథనాలపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్ మూలాలు.. చరిత్రాత్మక విజయం : వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ పార్టీ తరఫున ఘన విజయం సాధించిన గజాలా హష్మీ, అమెరికాలో ఈ స్థాయి పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె మన భాగ్యనగరంలో పుట్టిపెరగడం గర్వకారణం.
బాల్యం, విద్యాభ్యాసం: గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో కొంతకాలం పాతబస్తీలోని మలక్‌పేటలో తన అమ్మమ్మ ఇంట్లో గడిపారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో పనిచేశారు. నాలుగేళ్ల చిన్న వయసులోనే తల్లి, సోదరుడితో కలిసి ఆమె అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. అక్కడ చదువులో రాణిస్తూ, జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేశారు.
ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి: అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. అజహర్‌తో వివాహం తర్వాత 1991లో వర్జీనియాలోని రిచ్‌మండ్‌కు మారారు. అక్కడ రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో దాదాపు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా సేవలందించారు. 2019లో తొలిసారిగా వర్జీనియా సెనేట్‌కు ఎన్నికై, ఆ పదవి చేపట్టిన తొలి ముస్లిం మహిళగా నిలిచారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించారు.
న్యూయార్క్ మేయర్‌గా మరో సంచలనం : భారత్-ఉగాండా మూలాలున్న జోహ్రాన్ మమ్దాని, న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఈ పదవిని అధిరోహించి, గత శతాబ్దంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా, అలాగే తొలి దక్షిణాసియా, తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు.
ప్రముఖుల వారసుడు: మమ్దాని తల్లి ప్రముఖ భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కాగా, తండ్రి మహ్మద్ మమ్దాని కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉగాండాలో జన్మించిన మమ్దాని, తన ఏడో ఏట కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కు వలస వెళ్లారు.
ట్రంప్‌కు ఎదురుగాలి: సోషలిస్ట్ భావజాలం కలిగిన మమ్దాని, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించడం విశేషం. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఫలితం మమ్దానికే అనుకూలంగా వచ్చింది. ఈ విజయాలు అమెరికాలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు, ప్రవాస భారతీయుల పెరుగుతున్న ప్రాబల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు కలగా ఉన్న ఉన్నత పదవులు ఇప్పుడు మనవారికి వాస్తవరూపం దాల్చడం యావత్ భారత జాతికి గర్వకారణం.


